నేను దైవేచ్ఛానుసారం యేసు క్రీస్తుకు అపొస్తలుడనయ్యాను. దేవుడు వాగ్దానము చేసిన అనంతజీవితము యేసు క్రీస్తు వలన సంభవిస్తుంది. దాని కారణముగా నేను అపొస్తలుడనయ్యాను.
నీలాంటి వాణ్ణి నాకు యిచ్చినందుకు నేను దేవునికి ఎంతో కృతజ్ఞుణ్ణి. నీ కన్నీళ్ళు జ్ఞాపకం వస్తున్నాయి. నిన్ను చూడాలనిపిస్తుంది. నిన్ను చూసాక నా మనస్సు ఆనందంతో నిండిపోతుంది.
నీలో ఉన్న నిజమైన విశ్వాసం నాకు జ్ఞాపకము ఉంది. అటువంటి విశ్వాసం మీ అమ్మమ్మ లోయిలోనూ ఉండేది. నీ తల్లి యునీకేలో కూడా ఉండేది. నీలో కూడా అలాంటిది ఉందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను.
కనుక ప్రభువును గురించి చెప్పవలసి వచ్చినప్పుడు గాని, అతని ఖైదీనైన నా విషయము చెప్పవలసి వచ్చినప్పుడు గాని సిగ్గుపడకుము. దానికి మారుగా దేవుడు ఇచ్చిన శక్తిని ఉపయోగించి, సువార్త కోసం నాతో కలిసి కష్టాలు అనుభవించుము.
దేవుడు మనల్ని రక్షించి తన ప్రజలుగా మాత్రమే ఉండటానికి పిలిచాడు. మనము చేసిన పనులను బట్టి ఆయన ఇలా చేయలేదు. కాని ఇది కేవలం ఆయన అనుగ్రహం వల్ల, ఆయన ఉద్దేశానుసారం చేసాడు. దేవుడు కాలానికి ముందే యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహాన్ని ప్రసాదించాడు.
కాని ఇప్పుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు వచ్చి దాన్ని మనకు వ్యక్తము చేసాడు. ఈయన తన సువార్త ద్వారా మరణాన్ని నిర్మూలించి అనంత జీవితాన్ని, అమరత్వాన్ని వెలుగులోకి తెచ్చాడు.
ఆ కారణంగా నేను ప్రస్తుతం కష్టాలు అనుభవిస్తున్నాను. అందుకు నేను సిగ్గుపడను. ఎందుకంటే నేను విశ్వసించిన వాణ్ణి గురించి నాకు బాగా తెలుసు. ఆ రానున్న రోజు దాకా ఆయన నాకు అప్పగించిన దాన్ని, కాపాడుతాడని నాకు విశ్వాసం ఉంది.